శ్రీసాయిసచ్చరిత్రము
43, 44 అధ్యాయాలు
43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీరత్యాగం చేసిన కథనే వర్ణిస్తాయి కాబట్టి వాటిని ఒకచోట చేర్చడం జరిగింది.
ముందుగా సన్నాహము :
హిందువులలో ఎవరైనా మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మతగ్రంథాలు చదివి వినిపించడం సాధారణ ఆచారం. ఎలాగంటే ప్రపంచ విషయాలనుండి అతని మనస్సును మళ్ళించి భగవంతుని విషయాలలో లీనం చేస్తే అతడు పరాన్ని సహజంగా, సులభంగా పొందుతాడు. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషిబాలుడి చేత శపించబడి, వారంరోజులలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో గొప్పయోగి అయిన శుకుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించాడు. ఆ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారికి గీత, భాగవతం మొదలైన గ్రంథాలు చదివి వినిపిస్తారు. కానీ బాబా భగవంతుని అవతారం కావడం చేత వారికి అలాంటిది అవసరంలేదు. కానీ, బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజే అనే అతన్ని పిలిచి రామవిజయం గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. అతడు వారంలో గ్రంథం ఒకసారి పఠించాడు. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి మూడు రోజులలో రెండవ పారాయణ పూర్తిచేశాడు. ఈ విధంగా 11 రోజులు గడిచాయి. అతడు తిరిగి 3 రోజులలో చదివి అలసిపోయాడు. బాబా అతనికి సెలవిచ్చి వెళ్ళిపొమ్మని చెప్పారు. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రెండు మూడు రోజుల ముందునుండి బాబా గ్రామం బయటకు వెళ్ళడం, భిక్షాటన చేయడం మొదలైనవి మానేసి మసీదులోనే కూర్చునేవారు. చివరివరకు బాబా చైతన్యంతో ఉండి, అందరినీ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చారు. వారెప్పుడు చనిపొతారో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిరోజూ కాకాసాహెబు దీక్షిత్, శ్రీమాన్ బూటీ వారితో కలిసి మసీదులో భోజనం చేస్తూ ఉండేవారు. ఆ రోజు (1918 అక్టోబరు 15వ తారీఖు) హారతి తరువాత వారిని వారివారి ఇళ్ళకు వెళ్ళి భోజనం చేయమని అన్నారు. అయినా కొంతమంది లక్ష్మీబాయి శిందే, భాగోజీ శిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబు నిమాన్ కర్ అక్కడే ఉన్నారు. కింద మెట్లమీద శ్యామా కూర్చుని ఉన్నాడు. లక్ష్మీబాయి శిందేకి 9 రూపాయలు దానం చేసిన తరువాత, బాబా తనకు ఆ స్థలం (మసీదు) బాగోలేదని, అందుకే తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుని వెళితే అక్కడ బాగా ఉంటుందని చెప్పారు. ఈ తుదిపలుకులు చెపుతూ బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు. భాగోజీ దీన్ని కనిపెట్టారు. క్రింద కూర్చున్న నానాసాహెబు నిమాన్ కర్ కి ఈ సంగతి చెప్పారు. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోశారు. అవి బయటికి వచ్చాయి. అతడు గట్టిగా 'ఓ దేవా!’అని అరిచాడు. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా 'ఆ!’ అన్నారు. బాబా తన భౌతికశరీరాన్ని విడిచిపెట్టారని తేలిపోయింది. బాబా సమాధి చెందారనే సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చులా వ్యాపించింది. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు వెళ్ళి ఏడవసాగారు. కొందరు గట్టిగా ఏడ్చారు, కొందరు వీథులలో ఏడుస్తున్నారు, కొందరు తెలివితప్పి పడ్డారు. అందరి కళ్ళనుండి నీళ్ళు కాలువలా పారుతూ ఉన్నాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు.
కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షం అవుతానని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరు అన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కాబట్టి ఎవ్వరికీ సందేహం అక్కరలేదు. ఎలాగంటే కృష్ణావతారంలో శ్రీమహావిష్ణువు ఇటువంటి కార్యమే చేశారు. సుందర శరీరంతో, ఆయుధాలు కలిగిన చతుర్భుజాలతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారంలో ఎనిమిదేళ్ళ బాలుడుగానే ప్రత్యక్షమయ్యారు. ఆ అవతారంలో శ్రీకృష్ణుడు భూమిభారం తగ్గించారు. ఈ అవతారం (సాయిబాబా) భక్తులను ఉద్ధరించడం కోసం వచ్చింది. కాబట్టి సంశయించవలసిన కారణం ఏముంది? యోగుల జాడలు అగమ్యగోచరాలు. సాయిబాబాకు తమ భక్తులతో సంబంధం ఈ యొక్క జన్మతోనే కాదు, అది గడిచిన డెబ్బైరెండు జన్మల సంబంధం. ఇలాంటి ప్రేమబంధాలు కలిగించిన ఆ మహారాజు (సాయిబాబా) ఎక్కడికో పర్యటన కోసం వెళ్ళినట్లు అనిపించడం వలన వారు శీఘ్రంగానే తిరిగి వస్తారనే దృఢవిశ్వాసం భక్తులకు వుంది. బాబా శరీరం ఎలా సమాధి చేయాలనే విషయం గొప్ప సమస్య అయ్యింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టాలన్నారు. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. కాని రామచంద్ర పాటీలు అనే గ్రామ మునసబు గ్రామంలోని వారందరి నిశ్చితమైన దృఢకంఠస్వరంతో 'మీ ఆలోచన మాకు సమ్మతం కాదు. బాబా శరీరం రాతి వాడాలో పెట్టవలసిందే' అన్నాడు. అందుకే గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపారు. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడు, శ్యామాకు మేనమామ అయిన లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి, చేయిపట్టి ఇలా అన్నారు 'త్వరగా లెగు, బాపూసాహెబు నేను మరణించానని అనుకుంటున్నాడు. అందుకే అతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇవ్వు'. లక్ష్మణ్ మామా సనాతన ఆచారపరాయణుడు అయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజూ ఉదయం బాబాను పూజించిన తరువాత తక్కిన దేవతలను పూజిస్తూ ఉండేవాడు. అతనికి బాబా పట్ల పూర్ణభక్తివిశ్వాసాలు ఉండేవి. ఈ దృశ్యాన్ని చూడగానే పూజాద్రవ్యాల పళ్ళాన్ని చేతిలో పట్టుకుని మౌల్వీలు ఆటంకపరుస్తున్నా పూజను హారతిని చేసి వెళ్ళాడు. మిట్టమధ్యాహ్నం బాపూసాహెబు జోగ్ పూజాద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చాడు.
బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరాన్ని వాడలో ఉంచడానికి నిశ్చయించి అక్కడ మధ్యభాగంలో త్రవ్వడం ప్రారంభించారు. మంగళవారం సాయంకాలం రహతానుండి సబ్ ఇన్స్ పెక్టర్ వచ్చాడు. ఇతరులు తక్కిన స్థలాలనుండి వచ్చారు. అందరూ దాన్ని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయినుండి వచ్చాడు. కోపర్ గావ్ నుండి మామలతదారు వచ్చారు. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోచింది. కొందరు బాబా శరీరాన్ని బయటే సమాధి చేయాలని పట్టుబట్టారు. కాబట్టి మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించాలని అన్నారు. వాడాను ఉపయోగించడానికి రెండురెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ జిల్లా కలెక్టరును సంప్రదించాలని అతడు అన్నాడు. కాబట్టి కాకాసాహెబు దీక్షిత్ అహమద్ నగర్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈలోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయడానికి అంగీకరించారు. బుధవారం సాయంకాలం బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకునివెళ్ళారు. మురళీధరుని కోసం కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు. యథార్తంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయం అయ్యింది, అది ఒక పూజామందిరం అయ్యింది. అనేకమంది భక్తులు అక్కడికి వెళ్ళి శాంతిసౌఖ్యాలు పొందుతున్నారు. ఉత్తరక్రియలు బాలాసాహెబు బూటీ, ఉపాసనీ బాబా నెరవేర్చారు. ఉపాసనీ బాబా, బాబాకు గొప్పభక్తుడు.
ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసుకుపోలేదు. అవయవాలన్నీ సాగుతూనే ఉన్నాయి. వారి కఫనీ చింపకుండా సులభంగా తీయగలిగారు.
ఇటుకరాయి విరుగుట :
బాబా భౌతికశరీరాన్ని విడవడానికి కొన్ని రోజుల ముందు ఒక దుశ్శకునం జరిగింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చేయివేసి ఆనుకుని కూర్చునేవారు. రాత్రులలో దానిపై ఆనుకొని ఆసీనులై ఉండేవారు. అనేక సంవత్సరాలు ఇలా గడిచాయి. ఒకరోజు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ దాన్ని చేతితో పట్టుకొని ఉండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండు ముక్కలు అయ్యింది. ఈ సంగతి బాబాకి తెలియగానే వారు ఎంగాగానో చింతించి ఇలా అన్నారు 'ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడిని. నా జీవితంలో నాకెంత ప్రేమో దానిపట్ల నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచింది.’ ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు 'బాబా నిర్జీవి అయిన ఇటుక కోసం ఇంత విచారం ఎందుకు?’ అందుకు హేమాడ్ పంత్ ఇలా సమాధానం ఇచ్చారు. ‘యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయం చేయటం కోసం అవతరిస్తారు. వారు ప్రజలతో కలిసి మసులుతున్నప్పుడు ప్రజలలాగా నటిస్తారు. వారు మనలా బాహ్యానికి నవ్వుతారు, ఆడతారు, ఏడుస్తారు. కానీ లోపల వారు శుద్ధచైతన్యులు అయి వారి కర్తవ్యవిధులు తెలుసును.
72 గంటల సమాధి :
ఇటుక విరగడానికి 32 సంవత్సరాలకు పూర్వం అంటే, 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయాలని ప్రయత్నించారు. ఒక మార్గశిర పౌర్ణమిరోజు బాబా ఉబ్బసం వ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. దాన్ని తప్పించుకోవడం కోసం బాబా తన ప్రాణాన్ని పైకి తీసుకుని వెళ్ళి సమాధిలో ఉండాలని అనుకుని, భక్త మహాల్సాపతితో ఇలా అన్నారు. ‘నా శరీరాన్ని మూడు రోజులవరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేకపోతే నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలను పాతిపెట్టు' అని స్థలాన్ని చూపించారు. ఇలా అంటూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలిపోయారు. వారి ఊపిరి ఆగిపోయింది. వారి నాడి కూడా కొట్టుకోకుండా ఉంది. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లు ఉంది. ఊరివారందరూ అక్కడ చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపించిన స్థలంలో సమాధి చేయడానికి నిశ్చయించారు. కానీ, మహాల్సాపతి అడ్డగించాడు. తన ఒడిలో బాబా శరీరాన్ని ఉంచుకుని మూడురోజులు అలాగే కాపాడుతూ కూర్చున్నాడు. మూడు రోజుల తరువాత తెల్లవారుఝామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు గమనించాడు. ఊపిరి ఆడటం ప్రారంభించింది. కడుపు కదిలింది, కళ్ళు తెరిచారు, కాళ్ళూ చేతులూ సాగదీస్తూ బాబా లేచారు.
దీన్ని బట్టి చదివేవారు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మా? పంచభూతాత్మ అయిన శరీరం నాశనం అవుతుంది. శరీరం అశాశ్వతంగాని, లోపల ఉన్న ఆత్మ పరమ సత్యం, అమరం, శాశ్వతం. ఈ శుద్ధాత్మయే బ్రహ్మం. అదే పంచేంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకునేది, పరిపాలించేది. అదే సాయి, అదే ఈ జగత్తులో గల వస్తువులన్నిటిలో వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యాన్ని నెరవేర్చటం కోసం భౌతికశరీరం వహించింది. దాన్ని నెరవేర్చిన పిమ్మట శరీరం విడుస్తుంది. సాయి ఎల్లప్పుడూ ఉండేవారు. అలాగే పూర్వం గంగాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమైన శ్రీనారసింహసరస్వతి, వారు సమాధిచెందడం బాహ్యనికే గాని, సమస్త చేతనాచేతనాలలో కూడా ఉండి వాటిని నియమించువారు, పరిపాలించేవారూ వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్య శరణాగతి చేసిన వారికి, మనఃస్ఫూర్తిగా భక్తితో పూజించేవారికీ అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడటం వీలులేకపోయినప్పటికీ, మనం షిరిడీకి వెళ్ళినట్లయితే, వారి జీవితమెత్తు పటం మసీదులో వుంది. దీన్ని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడూ బాబా భక్తుడూ వ్రాసి ఉన్నాడు. బావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటం ఈ నాటికీ బాబాను భౌతికశరీరంతో చూసినంత తృప్తిని కలగజేస్తుంది. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడే కాక ప్రతిచోటా నివశిస్తూ పూర్వంలా తమ భక్తులకు మేలు చేస్తున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలే కనిపించినా నిజంగా వారే దైవం.
బాపూసాహెబు జోగ్ సన్యాసం :
జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథతో హేమాడ్ పంత్ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసి అయిన సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత (PWD Supervisor) భార్యతో షిరిడీకి వచ్చి నివశిస్తూ ఉన్నాడు. వారికి సంతానం లేదు. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవలోనే కాలమంతా గడుపుతూ ఉన్నారు. మేఘశ్యాముడు చనిపోయిన తరువాత బాపూసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందేవరకు హారతి ఇస్తూ ఉన్నాడు. అదీగాక ప్రతిరోజూ సాఠేవాడాలో జ్ఞానేశ్వరీ, ఏకనాథ భాగవతం చదివి, వినడానికి వచ్చిన వారందరికీ బోధిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు సేవ చేసిన జోగ్, బాబాతో 'నేనిన్నాళ్ళు నీ సేవచేశాను. నా మనస్సు ఇంకా శాతం పొందలేదు. యోగులతో సావాసం చేసినా నేను బాగుపడకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఎప్పుడు కటాక్షిస్తావు' అన్నాడు. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశిస్తుంది. నీ పాపపుణ్యాలు భస్మం అవుతాయి. ఎప్పుడు నీ అభిమానాన్ని పోగొట్టుకుని, మోహం అనే రుచిని జయిస్తావో, ఆటంకాలన్నిటిని దాటుతావో, హృదయపూర్వకమైన భగవంతుని సేవిస్తూ సన్యాసాన్ని పుచ్చుకుంటావో అప్పుడు నీవు ధన్యుడవు అవుతావు' అన్నారు. కొద్దికాలం తరువాత బాబా పలుకులు నిజం అయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికి ఇంకొక అభిమానం ఏదీ లేకపోవడంతో అతడు స్వేచ్చాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావధిని పొందాడు.
అమృతతుల్యమగు బాబా పలుకులు:
దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ కింది మధుర వాక్యాలు పలికారు. ‘ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించుకుంటారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం. నా కథలు తప్ప మరేమీ చెప్పడు, ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని ప్రసాదించి వారి ఋణం తేర్చుకుంటాను. ఎవరైతే నన్నే చింతిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినరో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం, అహంకారం కొంచెం కూడా లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి.’
నేననగా నెవరు ? :
నేను అంటే ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. బాబా ఇలా అన్నారు. ‘నన్ను వెదకడానికి నీవు దూరంగా కానీ ఇంకెక్కడికైనా కానీ వెళ్ళనక్కరలేదు. నీ పేరు నీ ఆకారం విడిచినట్లయితే నీలోనే కాకుండా అన్ని జీవులలోను, చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను దీన్ని నీవు గ్రహించి, నాలోనేగాక అన్నిటిలోనూ నన్ను చూడు. దీన్ని నీవు అభ్యసించినట్లయితే, సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందుతావు.’
హేమాడ్ పంత్ చదివేవారికి ప్రేమతో నమస్కరించి వేడుకునేది ఏమిటంటే వారు వినయవిధేయతలతో దైవాన్ని, యోగులను, భక్తులు ప్రేమించెదరుగాక! బాబా అనేకసార్లు 'ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారు అవుతారు. ఎవరైతే బాధలను అనుభవిస్తారో, ఒర్చుకుంటారో వారు నాకు ప్రీతి కలిగిస్తారు' అని చెప్పారు కదా! బాబా సర్వ వస్తు, జీవసముదాయాలలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నాలుగు వైపులా నిలబడి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించడమే తప్ప వారు ఇంకేమీ కోరుకోరు. ఇలాంటి శుభమైన, పరిశుభ్రమైన అమృతం వారి పెదవులనుండి స్రవిస్తూ ఉండేది. హేమాడ్ పంత్ ఇలా ముగిస్తున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడుతారో, ఎవరు దాన్ని భక్తితో వింటారో వారిరువురూ సాయితో ఐక్యం అవుతారు.
43, 44అధ్యాయాలు సంపూర్ణం
ఆరవరోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!