శ్రీసాయిబాబాసచ్చరిత్ర
నలభై ఏడవ అధ్యాయము
గత అధ్యాయంలో రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని బాబా వర్ణించారు. ఈ అధ్యాయంలో కూడా అలాంటి వృత్తాంతాలను వర్ణించేవి వీరభద్రప్ప మరియు చెన్నబసప్ప కథలు చెపుతాను.
శ్రీసాయి రూపం పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి సారించినట్లయితే ఎన్నో గతజన్మల విచారాలను నశింపచేసి, ఎంతో పుణ్యం ప్రాప్తించేలా చేస్తారు. వారి దయాదృష్టి మనపై పడినట్లయితే, మన కర్మబంధాలు వెంటనే విడిపోయి మనం ఆనందం పొందుతాము. గంగానదిలో స్నానం చేసేవారి పాపాలు అన్నీ తొలగిపోతాయి. అలాంటి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో పోగుపడిన పాపాలన్నీ వారి పాదధూళితో పోగొడతారని ఆతృతతో చూస్తుంది. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపం అంతా కడుక్కుని పోతాయని గంగామాతకు తెలుసు. యోగులలో ముఖ్యమైన అలంకారం శ్రీసాయి. పావనం చేసే ఈ క్రింది కథను వారినుండి వినండి.
వీరభద్రప్పప చెన్నబసప్పల (పాము - కప్పు) కథ:
సాయిబాబా ఒకరోజు ఇలా చెప్పసాగారు:
‘ఒకరోజు ఉదయం ఉపాహారం ముగించిన తరువాత అలా తిరుగుతూ ఒక చిన్న నది ఒడ్డు చేరుకున్నాను. అలసిపోవడంతో అక్కడ విశ్రాంతి పొందాను. చేతులు, కాళ్ళు కడుక్కుని స్నానం చేసి హాయిగా కూర్చున్నాను. అక్కడ చెట్ల నీడలు ఉన్న కాళిబాట, బండిబాట రెండూ ఉన్నాయి. చల్లని గాలి మెల్లగా వీస్తూ వుంది. చిలుము త్రాగడానికి తయారు చేస్తుండగా కప్పు ఒకటి బెకబెక అనడం విన్నాను. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీస్తుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయంతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాడు. కప్పు బెకబెక అనడం మళ్ళీ వినిపించింది. అతడు అది ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. ‘ఒక కప్పు తన పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తుంది' అని చెప్పాను. గతజన్మలో చేసినదాని ఫలం ఈ జన్మలో అనుభవించి తీరాలి. దాన్ని గురించి దుఃఖించినంత మాత్రాన ప్రయోజనం లేదు. అతను చిలుము పీల్చి నాకు అందజేసి అతనే స్వయంగా వెళ్ళి చూస్తాను అని చెప్పాడు. ఒక కప్పను పాము నోటితో పట్టుకోవడంతో అది అరుస్తూ వుందని గతజన్మలో రెండూ కూడా దుర్మార్గులే కాబట్టి ఈ జన్మలో గతజన్మ యొక్క పాపాన్ని ఈ దేహంతో అనుభవిస్తున్నాయని చెప్పాను. అతడు బయటకు వెళ్ళి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండటం చూశాడు.
‘అతడు నా దగ్గరికి వచ్చి 10, 12 నిముషాలలో పాము కప్పను మింగేస్తుందని చెప్పాడు. నేను ఇలా అన్నాను. ‘లేదు అలా జరగకూడదు. నేనే దాని తండ్రిని (రక్షకుడిని)! నేను ఇక్కడే ఉన్నాను. పాముచేత కప్పని ఎలా తినేలా చేస్తాను? నేను ఇక్కడ ఊరికే ఉన్నానా? దాన్ని ఎలా విడిపిస్తానో చూడు'.
చిలుము పీల్చిన తరువాత మేము ఆ స్థలానికి వెళ్ళాము. అతడు భయపడ్డాడు. నన్ను కూడా దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించాడు. పాము మీదపడి కరుస్తుందని వాడి భయం. అతని మాట లెక్కచేయకుండా నేను ముందుకు వెళ్ళి ఇలా అన్నాను 'ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్పు జన్మ ఎత్తి పశ్చాత్తాప పడటం లేదా? నువ్వు సర్ప జన్మ ఎత్తినప్పటికీ వాడిపట్ల ఇంకా శత్రుత్వం కొనసాగిస్తున్నావా? ఛీ, సిగ్గులేదా! మీ ద్వేషాలను విడిచిపెట్టి శాంతించండి.’
ఈ మాటలు విని ఆ సర్పం కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యం అయ్యింది. కప్ప కూడా గెంతువేసి చెట్ల పొదలో దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. ‘మీరన్న మాటలకు పాము కప్పను ఎలా వదిలి అదృశ్యమయింది? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణం ఏమిటి?’ అని అతడు ప్రశ్నించగా, అతనితో కలిసి చెట్టు మొదట్లోకి వెళ్ళాము. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాతం అంతా ఈ విధంగా బోధించాను.
‘మా ఊరికి 4, 5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం ఉంది. అది పాతబడి శిథిలమయింది. ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరమ్మత్తు చేయడం కోసం కొంత ధనాన్ని పోగు చేశారు. మరమ్మత్తు కోసం కొంత పెద్దమొత్తం పోగుచేసిన తరువాత పూజ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మరమ్మత్తు చేయడానికి అంచనా వేశారు. ఊర్లోని ధనవంతుడిని కోశాధికారిగా నియమించి అంతా అతని చేతిలో పెట్టారు. లెక్కలను చక్కగా రాసే బాధ్యత నాపై పెట్టారు. వాడు పరమ పిసినారి. దేవాలయం బాగుచేయడానికి చాలా తక్కువ ఖర్చుపెట్టాడు. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కనిపించలేదు. అతడు ధనం అంతా ఖర్చుపెట్టాడు. కొంత అతను మింగాడు. తన సొంత డబ్బు కొంచెం కూడా దాని కోసం ఖర్చుపెట్టలేదు. తియ్యని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకపోవడానికి ఏవో కారణాలు చెప్పేవాడు. గ్రామస్థులు తిరిగి వాడి దగ్గరకు వెళ్ళి అతడు సొంతంగా తగిన ధనసహాయం చేయకపోతే ఆలయం అభివృద్ధి కాదు అని చెప్పారు. వాడి అంచనా ప్రకారం పని కొనసాగించవలసిందని చెపుతూ మరి కొంత డబ్బులు వసూలుచేసి వాడికి ఇచ్చారు. వాడు ఆ ధనాన్ని పుచ్చుకొని, ఇంతకుముందులా ఊరికే కూర్చున్నాడు. కొన్నాళ్ళ తరువాత మహాదేవుడు వాడి భార్యకు కలలో కనిపించి ఇలా చెప్పారు 'నువ్వు లేచి దేవాలయ శిఖరం కట్టు. నువ్వు ఖర్చు పెట్టినదానికి 100 రెట్లు ఇస్తాను.’ ఆమె ఈ దృశ్యాన్ని తన భర్తకు చెప్పింది. అది డబ్బులు ఖర్చు కావడానికి కారణం అవుతుందేమో అని భయపడి ఎగతాళి చేస్తూ అది ఉత్త కలే అనీ దాన్ని నమ్మవలసిన అవసరం లేదు అనీ, లేకపోతే దేవుడు తనకి స్వప్నంలో కనపడి ఎందుకు చెప్పలేదు అనీ, తాను మాత్రం దగ్గర లేకుండా పోయానా అనీ, ఇది చెడ్డ కలలా కనిపిస్తుందనీ, భార్యాభర్తలకు గొడవ కల్పించేలా తోస్తుందనీ అతడు సమాధానం చెప్పాడు. అందుకే ఆమె ఊరుకోవలసి వచ్చింది.
దాతలను బాధించి వసూలు చేసే పెద్దమొత్తం ఛందాలలో దేవుడికి ఇష్టముండదు. భక్తితోనూ, ప్రేమతోను, మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్నమొత్తానికయినా దైవం ఇష్టపడతాడు. కొన్ని రోజుల తరువాత దేవుడు ఆమెకు కలలో తిరిగి కనిపించి ఇలా అన్నారు 'భర్త దగ్గర ఉన్న ఛందాల గురించి చికాకు పడవలసిన అవసరం లేదు. దేవాలయం నిమిత్తం ఏమైనా ఖర్చు పెట్టమని అతన్ని బలవంతం చేయొద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావం. కాబట్టి నీకు ఇష్టముంటే సొంతానిది ఏదైనా ఇవ్వాలి.’ ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకి ఇచ్చిన బంగారునగలు దానం చేయాలని నిశ్చయించుకుంది. ఆ పిసినారి ఈ సంగతి విని చికాకుపడి భగవంతుడిని కూడా మోసం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు అతనే కొని, నగదుకు బదులుగా ఒక పొలాన్ని దేవాలయ ఆదాయంగా ఇచ్చాడు. అందుకు భార్య అంగీకరించింది. ఆ పొలం వాడి సొంతం కాదు. అది ఒక పేదరాలైన డుబ్కీ అనే ఆమెది. ఆమె దాన్ని 200 రూపాయలకు కుదవ పెట్టింది. ఆమె దాన్ని తీర్చలేకపోయింది. ఆ టక్కరి పిసినారి తన భార్యను, డుబ్కీని, భగవంతుడిని అందరినీ మోసగించాడు. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇలా ముగిసిపోయింది. ఆ పొలాన్ని పూజారి ఆధీనంలో ఉంచారు. దానికి అతను సంతోషించాడు. కొన్నాళ్ళకు ఒక చిత్రం జరిగింది. పెద్ద తుఫాను వచ్చింది. కుంభవృష్టి కురిసింది, పిసినారి ఇంటిపై పిడుగుపడి వాడు, వాడి భార్య చనిపోయారు. డుబ్కీ కూడా మరణించింది.
తరువాతి జన్మలో ఆ పిసినారి మథురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేరుతొ ఉన్నాడు. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఆమెకు గౌరీ అనే పేరు పెట్టారు. డుబ్కీ మందిరాగోర వారి ఇంట్లో మగశిశువుగా జన్మించింది. అతనికి చెన్నబసప్ప అనే పేరు. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా దగ్గరకి తరచుగా వస్తుండేవాడు. నా దగ్గర కూర్చుని మాట్లాడుతూ చిలుము పీల్చేవాడు. అతని కూతురు గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుతుండేది. ఆమె తండ్రి వరుడి కోసం వెదుకుతూ ఉండేవాడు. ఆ విషయమై చికాకు పడవలసిన అవసరంలేదనీ, ఆమె భర్త తానే వెదుక్కుంటూ వస్తాడనీ నేను చెప్పాను. కొన్నాళ్ళ తరువాత వీరభద్రప్ప అనే ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్ష కోసం పూజారి ఇంటికి వచ్చాడు. పూజారి నా అంగీకారం ప్రకారం వాడికి గౌరవం ఇచ్చి పెళ్ళి చేశాడు. అతడు కూడా నా భక్తుడయ్యాడు. ఎలాగంటే పిల్లను కుదిర్చానని అతనికి నాపట్ల విశ్వాసం చూపిస్తూ ఉండేవాడు. వాడు ఈ జన్మలో కూడా ధనం కోసమే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉండేవాడు. నా దగ్గరికి వచ్చి అతను కుటుంబంతో ఉండడంతో తనకి ఎక్కువగా ధనం వచ్చేలా చేయమని బతిమాలుతూ ఉండేవాడు.
ఇలా ఉండగా కొన్ని విచిత్రాలు జరిగాయి. ధరలు హఠాత్తుగా పెరిగాయి. గౌరీ అదృష్టం కొద్దీ పొలానికి ధర పెరిగింది. కానుకగా ఇచ్చిన పొలం ఒక లక్ష రూపాయలకు అమ్మారు. ఆమె ఆభరణాల విలువ 100 రెట్లు వచ్చాయి. అందులో సగం నగదుగా ఇచ్చారు. మిగిలిన దాన్ని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నిశ్చయించారు. దానికి అందరూ అంగీకరించారు. కాని డబ్బుకోసం గొడవపడ్డారు. సలహాకోసం నా దగ్గరికి వచ్చారు. ఆ ఆస్తి మహాదేవుడిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేకపోవడంతో సర్వహక్కులు గౌరికి వచ్చాయి. ఆమె అంగీకారం లేకుండా ఏమీ ఖర్చు చేయొద్దని చెప్పాను. ఆమె భర్తకు ఈ డబ్బుపై ఎటువంటి అధికారం లేదు అని చెప్పాను. ఇది విని వీరభద్రప్ప నాపై కోప్పడ్డాడు. ఆస్తి కోసం గౌరికే హక్కు ఉందని తీర్మానించి దాన్ని కబళించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు. అతని మాటలు విని భగవంతుడిని ధ్యానించి ఊరుకున్నాను. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టాడు. అందకే ఆమె పగటిపూట నా దగ్గరకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకోవద్దు అని తనను కూతురుగా చూసుకోవాలనీ వేడుకుంది. ఆమె నా ఆశ్రయం కోరడంతో నేను ఆమెను రక్షించడానికి సప్తసముద్రాలైనా దాటుతానని వాగ్దానం ఇచ్చాను. ఆరోజు రాత్రి గౌరికి ఒక కల కనిపించింది. మహాదేవుడు కలలో కనిపించి ఇలా అన్నారు. ‘ధనం అంతా నీదే. ఎవరికీ ఏమీ యివ్వవద్దు. చెన్నబసప్ప సలహా తీసుకుని దేవాలయాన్ని మరమ్మత్తు కోసం కొంత ఖర్చుపెట్టు. ఇతరులకు ఖర్చు చేయవలసినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకో.’ గౌరీ నాకు ఈ సంగతి అంతా చెప్పింది. నేను తగిన సలహా ఇచ్చాను. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమనీ వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదని నేను గౌరికి సలహా ఇచ్చాను. నేను ఇలా మాట్లాడుతూ ఉండగా వీరభద్రప్ప చెన్నబసప్ప పోట్లాడుకుంటూ నా దగ్గరికి వచ్చారు. సాధ్యమైనంతవరకు వారిని సమాధాన పరిచాను. గౌరికి మహాదేవుడు చూపించిన కల దృశ్యాన్ని చెప్పాను. వీరభద్రప్ప ఎంతో కోపంతో చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని బెదిరించాడు. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదాలను పట్టుకుని నన్ను ఆశ్రయించాడు. కోపిష్టి శతృవు బారి నుండి కాపాడుతానని నేను వాడికి వాగ్దానం చేశాను. కొంతకాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు. చెన్నబసప్ప బెకబెక అనడం విని, నేను చేసిన వాగ్దానం గుర్తుకు తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వాడిని రక్షించాను, నా మాటను నిలబెట్టుకున్నాను. భగవంతుడు ఆపద సమయంలో భక్తులను రక్షించడం కోసం వారి దగ్గరికి పరిగెత్తాను. భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించి చెన్నబసప్పని రక్షించాడు. ఇది అంతా భగవంతుని లీల.
నీతి :
ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించాలి. ఇతరులతో గల సంబంధాలు అన్నిటినీ, బాధను కూడా అనుభవించాలి. తప్పించుకునే సాధనం లేదు. తనకి ఎవరితోనైనా శత్రుత్వం ఉన్నట్లయితే దాన్నుండి విముక్తి పొందాలి. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చేయాలి. ఋణంగాని, శతృశేషం గాని ఉన్నట్లయితే దానికి తగిన బాధపడాలి. డబ్బు పట్ల పేరాశ కలవాడిని అది హీనస్థితికి తెస్తుంది. చిట్టచివరికి వాడికి నాశనం కలిగిస్తుంది.
నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం
Note: HTML is not translated!