saibaba-satcharitra-48-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై ఎనిమిదవ అధ్యాయం

ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఎవరో హేమాడ్ పంత్ ను 'బాబా గురువా? లేక సద్గురువా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం సద్గురువు లక్షణాలను హేమాడ్ పంత్ ఇలా వివరిస్తున్నారు.

సద్గురువు యొక్క లక్షణాలు :

ఎవరు మనకు వేదవేదాంతాలను, షట్ శాస్త్రాలను బోధిస్తారో, ఎవరు చక్రాంకితం చేస్తారో, ఎవరు ఉచ్చ్వాసనిశ్శ్వాసాలను బంధిస్తారో, ఎవరు బ్రహ్మాన్ని గురించి అందంగా ఉపన్యాసాన్ని ఇస్తారో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునఃశ్చరణం చేస్తారో, ఎవరు తమ మాటలశక్తితో జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అటువంటి వారు సద్గురువులు కాదు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖాలపట్ల విరక్తి కలిగిస్తారో, ఎవరు ఆత్మసాక్షాత్కారం పట్ల మనకి అభిరుచి కలిగేలా చేస్తారో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయంలో పుస్తక జ్ఞానమే కాకుండా ఆచరణలో అనుభవం కూడా పొంది ఉన్నారో అటువంటి వారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారాన్ని స్వయంగా పొందని గురువు దాన్ని శిష్యులకు ఎలా ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నంలో అయినా శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలాన్ని గాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయాలని అనుకుంటారు. తాను గోప్పవాడిననీ తన శిష్యుడు తక్కువవాడు అనీ భావించడు. సద్గురువు తన శిష్యుడిని కొడుకులా ప్రేమించడమే కాకుండా తనతో సరిసమానంగా చూస్తాడు లేదా పరబ్రహ్మస్వరూపంగా చూస్తాడు. సద్గురువు యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు శాంతానికి ఉనికిపట్టు, వారు ఎప్పుడూ చాపల్యం కాని చికకు కాని చెందరు. తమ పాండిత్యానికి వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.

హేమాడ్ పంత్ తన పూర్వజన్మ సుకృతంతో సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదాన్ని, సహవాసాన్ని పొందానని అనుకున్నారు. బాబా యవ్వనంలో కూడా ధనాన్ని కూడబెట్ట లేదు. వారికి కుటుంబం కాని, స్నేహితులు కాని, ఇళ్ళు కాని, ఎటువంటి ఆధారం కూడా లేకపోయింది. 18ఏళ్ళ వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నారు. వారు ఒంటరిగా, నిర్భయంగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్చమైన అభిమానాన్ని చూసి వారి మేలు కోసమే ఉండేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతికశరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఎటువంటి అనుభవాలు ఇచ్చేవారో అటువంటి వారు మహాసమాధి చెందిన తరువాత కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఇస్తున్నారు. అందుకే భక్తులు చేయవలసినది ఏమిటంటే భక్తివిశ్వాసాలనే హృదయ దీపాన్ని సరిచేసుకోవాలి. ప్రేమ అనే వత్తిని వెలిగించాలి. ఎప్పుడు ఇలా చేస్తే అప్పుడు జ్ఞానం అనే జ్యోతి (ఆత్మా సాక్షాత్కారం) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రేమలేని జ్ఞానం ఉట్టిదే. అటువంటి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు. ప్రేమ లేకపోతే సంతృప్తి ఉండదు. కాబట్టి మనకు అవిచ్చిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండాలి. ప్రేమను మనం ఎలా పొగడగలం? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిది అవుతుంది. ప్రేమ అనేదే లేకపోతే చదవడం గాని, వినడం గాని, నేర్చుకోవడం గాని ఉపయోగం లేదు. ప్రేమ అనేది వికసించినట్లయితే భక్తి, నిర్వ్యామొహం, శాంతి, స్వేచ్చలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వస్తాయి. దీన్ని గురించి గాని ఎక్కువగా చింతించనిదే దానిపట్ల మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్నచోటనే భగవంతుడు తానే సాక్షాత్కరిస్తారు. అదే ప్రేమ, అదే మోక్షానికి మార్గం.

ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలిద్దాము. స్వచ్చమైన మనస్సుతో ఎవరినైనా నిజమైన యోగీశ్వరుడి దగ్గరికి వెళ్ళి వారి పాదాలపై పడినట్లయితే, చిట్టచివరికి అతడు రక్షింపబడతాడు. ఈ విషయం క్రింది కథవలన తెలుస్తుంది.

శివడే :

షోలాపూర్ జిల్లా అక్కల్ కోట నివాసి, సపత్నేకర్ న్యాయపరీక్ష చదువుతూ ఉండేవాడు. తోటి విద్యార్థి శివడే అతనితో చేరాడు. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠాల పట్ల జ్ఞానం సరిగ్గా ఉన్నదీ లేనిదీ చూసుకుంటున్నారు. ప్రశ్నోత్తరాల వలన శివడేకు ఏమీ రానట్లు తోచింది. మిగిలిన విద్యార్థులు అతన్ని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినా తనపట్ల బాబా కృప ఉండడంతో ఉత్తీర్ణుడిని అవుతానని చెప్పాడు. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడ్డాడు. సాయిబాబా ఎవరు? వారిని ఎందుకు పొగుడుతున్నావు? అని అడిగాడు. అందుకు శివడే ఇలా అన్నాడు 'షిరిడీ మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు గొప్ప సత్పురుషులు, ఇంకా ఇతర యోగులున్నా వారు అమోఘమైనవారు. పూరజన్మ సుకృతం ఉంటే కాని మనం వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్ముకున్నాను. వారు పలికేది ఎప్పుడూ అసత్యం కానేకాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడిని అవుతాను' అని చెప్పాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వాడు. వాడిని బాబా కూడా వెక్కిరించారు.

సపత్నేకర్ దంపతులు :

సపత్నేకర్ న్యాయపరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి, అక్కడ న్యాయవాది అయ్యాడు. పదిసంవత్సరాల తరువాత అనగా 1913లో వాడికి ఉన్న ఒకే ఒక్క కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాడు. అందువల్ల అతని మనస్సు వికలమయ్యింది. పండరీపురం, గాణగాపురం మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్ర కోసం వెళ్ళి శాంతి పొందాలని అనుకున్నాడు. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాడు కాని అది కూడా సహాయపడలేదు. అంతలో శివడే మాటలు అతనికి బాబా పట్ల ఉన్న భక్తి కూడా గుర్తుకు వచ్చింది. కాబట్టి తాను కూడా షిరిడీకి వెళ్ళి శ్రీసాయిని చూడాలి అని అనుకున్నాడు. అతడు తన సోద్రరుడైన పండితరావుతో షిరిడీకి వెళ్ళాడు. దూరం నుండే బాబా దర్శనం చేసుకుని సంతోషించాడు. గొప్ప భక్తితో బాబా దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయ అక్కడ పెట్టి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘బయటకు పొమ్ము!’ అని బాబా అరిచారు. సమత్నేకర్ తలవంచుకుని కొంచెం వెనక్కు జరిగి అక్కడ కూర్చున్నాడు. బాబా కటాక్షం పొందడం కోసం ఎవరి సలహా అయినా తీసుకోవాలని ప్రయత్నించాడు. కొందరు బాలాషింపి పేరు చెప్పారు. అతని దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. వారు బాబా ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదీ అని అడిగారు. దాన్ని ప్రేమించే వారిది అని బాబా చెబుతూ సపత్నేకర్ వైపు చూశారు. బాబా నవ్వగా అక్కడ ఉన్నవారందరూ నవ్వారు. బాలాషింపి ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యం ఏమిటి అని బాబాను అడుగుతూ సపత్నేకర్ దగ్గరకి జరిగి బాబా దర్శనం చేయమని చెప్పారు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించగా, బాబా మళ్ళీ వెళ్ళిపొమ్మని అరిచారు. సమత్నేకర్ కి ఏం చేయాలో తోచలేదు. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సమత్నేకర్ ను ఆజ్ఞాపించారు. ఇద్దరూ విచారంతో నిరాశ చెందారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండటంతో సపత్నేకర్ షిరిడీ వదలాల్సి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడు అయినా దర్శనం ఇవ్వాలని అతడు బాబాను వేడుకున్నాడు.

సపత్నేకర్ భార్య :

ఒక సంవత్సరం గడిచింది. కాని అతని మనసు శాంతి పొందకుండా ఉంది. అతడు గాణగాపురం వెళ్ళాడు కాని అశాంతి పెరిగింది. విశ్రాంతి కోసం మాడేగావ్ వెళ్ళాడు, చివరికి కాశీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. బయలుదేరడానికి రెండు రోజుల ముందు అతని భార్యకి ఒక స్వప్నదృశ్యం కనిపించింది. స్వప్నంలో ఆమె నీళ్ళ కోసం కుండ పట్టుకుని లకడ్షాబావికి వెళుతుంది. అక్కడ ఒక ఫకీరు తలకు ఒక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట్లో కూర్చున్నవారు తన దగ్గరికి వచ్చి 'ఓ అమ్మాయి! అనవసరంగా శ్రమ పడతావు ఎందుకు? నేను స్వచ్చమైన జలంతో నీ కుండ నింపుతాను' అన్నారు. ఆమె ఫకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఫకీరు ఆమె వెంటపడ్డాడు. ఇంతటితో ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఆమె తన కలను భర్తకు చెప్పింది. అదే శుభశకునం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరుకునేప్పటికి బాబా అక్కడ లేకుండాపోయారు. వారు లెండీ తోటకు వెళ్ళి ఉన్నారు. బాబా తిరిగి వచ్చేవరకు వారు అక్కడే ఆగారు. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు, బాబాకు భేదం ఏమీ లేదు అని చెప్పింది. ఆమె అత్యంత భక్తితో బాబాకు సాష్టంగంగా నమస్కరించి బాబాను చూడడానికి అక్కడే కూర్చుంది. ఆమె అణుకువ చూసి సంతోషించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. ‘నా చేతులు, పొత్తికడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుతున్నాయి. నేను అనేక ఔషధాలు పుచ్చుకున్నాను, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలించక పోవడంతో విసుగు చెందాను. కాని నొప్పులన్నీ ఇక్కడ వెంటనే తగ్గిపోవడంతో ఆశ్చర్యపడుతున్నాను' అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతం అంతా సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం తగ్గిపోవడంతో ఆమె సంతోషించింది.

సపత్నేకర్ ముందుగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. మళ్ళీ బాబా బయటకు వెళ్ళిపోమన్నారు. ఈసారి అతడు ఎంతగానో పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉన్నాడు. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసినదాని ప్రతిఫలం అని గ్రహించి, దాని విరుగుడు కోసం ప్రయత్నిస్త్గూ ఉన్నాడు. బాబాని ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టాడు. బాబా కాళ్ళు నొక్కుతూ సమత్నేకర్ అక్కడే కూర్చున్నాడు. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుము పడుతూ ఉంది. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పడం మొదలుపెట్టారు. వాడి జీవితంలోని కష్టాలన్నీ వర్ణించారు. అందులో వాడికి ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పారు. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. బాబాకు తన విషయాలు అన్నీ తెలవడంతో విస్మయం చెందాడు. బాబా సర్వజ్ఞుడు అని గ్రహించాడు. అతడు అందరి హృదయాలు గ్రహిస్తారని అన్నారు. ఈ ఆలోచనలు మనస్సున మెదులుతుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెపుతున్నట్లే నటించి సమత్నేకర్ వైపు చూసి ఇలా అన్నారు. ‘వీడు తన కొడుకును నేను చంపానని నన్ను నిందిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? యితడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడవాలి? అదే బిడ్డను వీడి భార్య గర్భంలోకి మళ్ళీ తెస్తాను.’ ఈ మాటలతో బాబా అతని తలపై హస్తం ఉంచి ఓదార్చి ఇలా అన్నారు. ‘ఈ పాదాలు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టాలు తీరిపోయాయి. నాయందే నమ్మకం ఉంచుకో. నీ మనోభీష్టాలు నెరవేరుతాయి.’ సపత్నేకర్ మైమరిచిపోయాడు. బాబా పాదాలను కన్నీటితో తడిపాడు. తరువాత తన బసకు వెళ్ళాడు.

సపత్నేకర్ పూజాసామాగ్రి అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో వెళ్ళి ప్రతిరోజూ బాబాకు సమర్పించి వారి దగ్గర ప్రసాదం పుచ్చుకుంటూ ఉండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరిస్తూ ఉండేవాడు. ప్రేమ వినయాలతో ఒక్కసారి నమస్కరించినా చాలు అని బాబా చెప్పారు. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవాన్ని చూశాడు. అందులో బాబా పాండురంగడిలా ప్రకాశించారు.

ఆ మరుసటి రోజు ఇంటికి వెళుతున్నప్పుడు బాబాకి మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినట్లయితే రెండవ రూపాయి లేదనకుండా ఇవ్వవచ్చు అని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు వెళ్ళి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగారు. బాబా వాడిని ఆశీర్వదించి ఇలా అన్నారు. ‘టెంకాయను తీసుకో. నీ భార్య చీరకొంగులో పెట్టు. హాయిగా వెళ్ళు. మనస్సులో ఎటువంటి ఆందోళన ఉంచుకోకు!’ అతను అలాగే చేశాడు. ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాడు. 8 మాసాల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదాలపై పెట్టి ఇలా ప్రార్థించారు. ‘ఓ సాయీ! నీ బాకీ ఎలా తీర్చుకోగలమో మాకు తోచడం లేదు. కాబట్టి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నిస్సహాయులం కావడంతో మమ్మల్ని ఉద్దరించవలసినది. ఇక మీదట మేము మీ పాదాలనే ఆశ్రయిస్తాము గాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను, జాగృతావస్థలోను మమ్మల్ని బాధిస్తున్నాయి. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్మల్ని రక్షించు!’’

ఆ దంపతులు తమ కుమారుడికి మురళీధర్ అనే పేరు పెట్టారు. తరువాత భాస్కర్, దినకర్ అనే ఇద్దరు జన్మించారు. బాబా మాటలు వృధా అవ్వవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాల జరుగుతాయని కూడా నమ్మారు.

నలబై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-48-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!