మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు
పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అంటారు.
భాద్రపదమాసంలో కృష్ణపక్షానికి మహాలయ పక్షం అని పేరు. మహాలయం అంటే గొప్ప వినాశనం కానీ మరణం అని అర్థం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షం రోజులు పితృదేవతలకు ప్రీతికరం. సెప్టెంబర్ 17th నుండి 30th వరకు. మహాలయం పక్షంలో రోజులలో పూర్వికులు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో ఈ పక్షం రోజులలో పిండప్రదానం, తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు కాబట్టే దీనికి పితృపక్షం అని పేరు అంటారు. ఈ మహాలయ పక్షంలో రోజూ లేదా మరణించినవారి ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే పితృలు సంవతరం వరకు సంతృప్తి పొందుతారని స్కాంద పురాణం చెబుతున్నది.
పితృదోషాలకు కారణం పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల తరువాతి తరం వారు కష్టాల పాలవడం జరుగుతుంది. పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తికాకపోవడం, పనులలో ఆటంకాలు, వైఫల్యాలు ఎదురవడం, స్త్రీలకు యవ్వనంలోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబసభ్యుల మానసికస్థితి బాగుండక పోవడం, సంతానం లేకపోవడం వంటివి సంభవిస్తాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటినుండి ఉపశమనం పొందడానికి ప్రతి వ్యక్తీ పితృఋణం తీర్చుకోవాలి.
మహాలయ పక్షంలో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతల ఆకలిదప్పులు తీరుస్తాయని, సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశ ఉన్నతికి కారణమవుతుంది ని జ్యోతిష్యులు చెబుతున్నారు. పితృఋణం తీర్చుకోవడానికి పితృదేవతలు మరణించిన తిథులలో వారికి సంవత్సరీకాలు, పిండప్రదానాలు, తర్పణలు నిర్వర్తించాలి. అలా చేయలేనప్పుడు గయాది తీర్థాలలో పిండప్రదానలు చేయాలి లేకపోతే పుష్కరాల పర్వాలలో నిర్వర్తించాలి అదీ చేయలేనప్పుడు భాద్రపదమాసంలో వచ్చే కృష్ణపక్షంలో పితృదేవతలకు పిండప్రదానాలు తప్పక చేయాలి.
ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశిలో ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. భాద్రపద బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొన్ని రోజులు సింహరాశిలోను, కొన్ని రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. అందుకే కన్యారాశి, తులరాశులలో సూర్య సంచారం జరిగే కాలమంతా పితృదేవతలు తమ ప్రేతపురిలో భోజనపానీయాలు లేకుండా ఉంటారు. ఇటువంటి సమయంలో వారు అందరూ భూలోకానికి వచ్చి వారి వారి ఇళ్ళ చుట్టూ ఆహారం కోసం తిరుగుతూ ఉంటారని మహాభారతంలో వివరించడం జరిగింది.
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో వచ్చే నవమి రోజున తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. అలాగే తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఈ పక్షంలో తప్పకుండా పితృకర్మలు చేయాలని ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. పితృఋణం తీర్చుకోవడానికి మహాలయ పక్షం అంతా చేయలేనివారు కనీసం ఒక్క మహాలయం అయినా చేసితీరాలి. ఆ ఒక్కరోజు కూడా చేయలేనివారు హిరణ్యశ్రాద్ధం చేయాలి. పితృదేవతలకు శ్రాద్ధం చేసే సమయంలో తర్పణాన్ని కూడా ఆ ప్రక్రియలో భాగం చేయాలి.
శ్రాద్ధ ప్రక్రియను చేయడానికి పురోహితులు దొరకని పరిస్థితులలో ముగ్గురు పితృదేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని పార్వణశ్రాద్ధం లేదా చటకశ్రాద్ధం అని అంటారు. బ్రాహ్మణులు లేకుండా పితృదేవతలను ఆవాహన చేయడం కొన్ని సంప్రదాయాలలో ఉంది. తగిన కారణంతో ఈ శ్రాద్ధకర్మ చేయలేని సమయంలో కుప్తంగా చేసే శ్రాద్ధవిధిని దర్శశ్రాద్ధం, ఆమశ్రాద్ధం లేదా హిరణ్యశ్రాద్ధం అని పిలుస్తారు.
అన్ని శ్రాద్ధకర్మలలో పితృదేవతలకు ప్రీత్యర్థం చేసే తిలాంజలినే తర్పణం అని అంటారు. ఇటువంటి తిలాతర్పణాన్ని ఇంట్లో చేయకూడదు. ఇంట్లోని తులసికోట దగ్గర కానీ, ఇంటి ఆవరణలో కానీ తర్పణాలు వదలాలి. తండ్రి జీవించి ఉన్నవారు తర్పణాలు వదలకూడదు. తర్పణాలు ఇచ్చే సమయంలో మొదటి బంధుత్వం (మాతు: పితు: మాతులః) తరువాత వారి వారి పేరు, గోత్రం చివరగా పితృదేవతారూపం (వసు, రుద్ర, ఆదిత్య) చెప్పి తర్పణాలు వదిలిపెట్టాలి. మాతృ, పితామహి, ప్రపితామహి ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలు అందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదిలిపెట్టాలి. మిగిలినవారికి వారి వారి సూత్రానుసారంగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి.
తర్పణాలు ఇచ్చే సమయంలో కుడిచేతి ఉంగరపు వ్రేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం పెట్టుకోవాలి. యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా కుడిభుజంపై వేసుకుని, ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని, కుడిచేతిలో నువ్వులు ఉంచుకుని, చూపుడు వ్రేలు, బొటన వ్రేలు మధ్య నుండి నీరు, తిలలు వదిలిపెట్టాలి. ఒకరోజే రెండు కారణాల వల్ల రెండుసార్లు తర్పణాలు ఇవ్వకూడదు, ఒక్కసారే ఇవ్వాలి. అమావాస్య, సంక్రమణం ఒకేరోజు వస్తే అమావాస్య తర్పణం మాత్రమే ఇవ్వాలి. అలాగే దక్షిణాయన/ఉత్తరాయణ పుణ్యకాలాలు అమావాస్య రోజున వస్తే, ఆయన పుణ్యకాలంలో మాత్రమే తర్పణాలు వడిచిపెట్టాలి. పితరులకు తర్పణం విడిచిపెట్టే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం.
శ్రాద్ధకర్మలు
తిథి ఉపయోగాలు
పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశుసంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి
అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి
మహాలయ రోజు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాకుండా వారి సంరక్షకుడైన శ్రీమహావిష్ణువుకి కూడా చేరతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశిష్టత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాలు, పిండప్రదానం సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విధి కర్మలను ఆచరించాలి. ప్రతి ఏటా చేసే శ్రాద్ధకర్మల కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేష్ఠం, శుభకరం.
దానశీలిగా ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించిన కర్ణుడు మరణించిన తరువాత స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యలో తీవ్రమైన ఆకలి, దాహం వేస్తుండగా దగ్గరలో ఉన్న ఫలవృక్షానికి ఉన్న పండును కోసుకుని తినాలి అనుకునే సమయంలో ఆ పండు బంగారుపండుగా మారిపోయింది. అదే విధంగా సమీపంలో ఉన్న ఫలవృక్షాల ఫలాలు కోద్దాం అనుకుంటుండగా అవి కూడా బంగారు పళ్ళుగా మారిపోయాయి. దాహం తీర్చుకుందాము అని సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ ఆ నీళ్ళు ఆ నీరు కూడా స్వర్ణజలంగా మారిపోయాయి. స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయింది.
విపరీతమైన ఆశ్చర్యానికి గురైన కర్ణుడు ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తుండగా "కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలు అన్నీ బంగారం, వెండి, డబ్బు రూపంలో చేశావు కానీ ఒక్కరికైనా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది'’ అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
కర్ణుడు తన తండ్రైన సూర్యుడి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని ప్రాధేయపడగా, ఆయన కోరిక ప్రకారం దేవతలకు రాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. “నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులు అందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి చేరుకో'’మని అన్నాడు. దేవేంద్రుడి సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి చేరుకొని అక్కడ పేదలు, బంధుమిత్రులకు అన్న సంతర్పణ చేశాడు, పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య రోజు స్వర్గానికి వెళ్ళాడు. చిత్రంగా ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, దాహార్తి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షం అని పేరు.
భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్థ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. శ్రాద్ధ కాలం ప్రారంభం అయిందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్రపౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య రోజు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద కర్మ నిర్వర్తించకపొతే దీవెనలకు బదులు శపించి వెళ్ళిపోతారు.
ఆర్ధిక ప్రభావంతో విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలుకాకపోతే గోవుకి గ్రాసం పెట్టవచ్చు అది కూడా చేయలేనివారు ఒక నిర్జన ప్రదేశంలో నిలబడి అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృదేవతలకు నమస్కరించవచ్చు. ఏమీ చేయలేనివారు సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరికి వెళ్ళి వృక్షాన్ని హత్తుకుని పితరులను ఉద్దేశించి కన్నీరైనా కార్చాలి. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.
Note: HTML is not translated!